Monday, August 3, 2020

Some more poems

!
--------

@అనువాదమేల?

కవితలన మనోహర భావములు
కదిలించు హృదయ సీమలను
ఎవరి నోట పలికినను ఆ మధురిమలు
పంచ వలెనవి పదిమంది లోను.
-------+--


@నిశ్శబ్ద క్షణం:

మనసులోని రణగొణలుu
మసలు చుండు యోచనలు
అనుకోని క్షణమున ఆగి పోవుచుండు
ఆవరించు నేదొ నిశ్శబ్దమపుడు
అందరానిదా అనుభూతి
జగమెల్ల కనిపించు నిత్య నూతనముగా
క్షణమైననూ ఆ అనుభూతి
చకితులై పోదుము!y

&&&&&******&&&&&&

( కృత్రిమ మేధ గురించి ప్రయోగాత్మక రచన. విమర్శలకు స్వాగతం. నచ్చక పోతే విమర్శించి చీల్చి చెండాడ వచ్చును. మౌనం మాత్రం ఆమోద యోగ్యం కాదు!)

        పుష్ప విభ్రమం:             (అనియతము)

స్వప్నమందున నాకు సాకారమయ్యె-
సౌందర్య పుష్పము, చకితుండనైతి!

అందుకొనగ బోవ అది మాయమయ్యె
చేజారి పోవగ చింత గల్గినది!
పొందవలయునని పూనుకున్నాను.
వెదకుతూ బోతి వీధులంతటను
కానలందెల్లను కోనలందునను
సరస్సులందునను సైకతమ్ములను!

కనిపించె చివరకు కనులార నాకు
నందన వనమున నగరమధ్యమున
విరజిమ్మె కాంతులు వింతగా మెరిసి
అతి సుందరమ్ముగ అలరారు చుండె!

అందుకొనగ బోవ అందకుండినది
అప్సరసలెవ్వరొ అడ్డుకొన్నారు
ఎదురైన వారిని ఎవరు మీరంటి
ఎనలేని సొగసుల ఇంతుల తోడ
బదులు చెప్పిరి వారు పకపకా నవ్వి:

"మేం కృత్రిమ మేధా పుత్రికలం
భ్రమాజనిత భావనా పత్రికలం!

యోచనలకు మేం కత్తెర వేస్తాం
నిజానిజాలకు మధ్య దూరం చెరిపేస్తాం!

కావాలనే  కాలహరణం చేసేస్తాం
బానిసలను భ్రమలో ముంచేస్తాం
బోధకులను మేం బోల్తా కొట్టిస్తాం
బ్రదుకులను మేం వ్యర్థం చేసేస్తాం"!

నశించె నాకు శక్తి  నీరసించి పోతిని
నిస్సహాయుడనై నిలుచుండి పోతిని!
బయట పడుటెట్లు భ్రమాలోకము నుండి?
మనసు రాయిగ జేసి స్మరించుకుంటిని
" జయ హనుమాన్  జ్ఞాన గుణ సాగర!
హరోంహరహర! హరోంహరహర!
రామా నీ దయ రాదా! గోవిందా! గోవిందా"!

మెలమెల్లగా నేను మేలుకొన్నాను,
మెలమెల్లగా నేను కోలుకున్నాను.
ఆదిత్య తేజమ్ము అత్యంత కాంతితో
కనుల గ్రుచ్చుకొనెను కలను మరపించెను
నిజము నిష్ఠూరమై నా ముందు నిలచెను!

అసలు లోకపు టందములు అద్భుతమ్మై తోచెను
చరాచర జగమెల్ల సౌందర్యమే విరిసెను!

వెదుక బోవుటదేల విరిసె కనుల ముందె!

+-----+-----+
--------

@ సంతసం - సౌందర్యం:

1.సంత‌సం
(అనియత ఛందము)

తీరని ఆకలిలో మారని మనుగడలో
కనబడదు సౌందర్యం కావలసినదాహారం!

ఆకలికి మందేది? అన్నమే వేరేది!
అది లేని మనిషికి ఆనందమింకేది?
అందించు ముందుగా అన్నపానములను!

మూడు పూట్ల తినియు ముఖము ముడుచుటేల
పేదల పేరు జెప్పి విష పూరితమగు
విద్వేష జ్వాలలు విరజిమ్ముటేల
ముదము పంచరాదె మూణ్ణాళ్ల బ్రదుకున
నీవు దుఃఖము పంచ నిండునా కడుపులు
అయ్యొ పాపమనిన అమరునా ఉడుపులు
చేతనైనది చెయ్యి చెడు తలపులేల
లేని వానికి పెట్టు లేదు మంచికి హద్దు!
తిన్నవానిని జూచి తిట్టు కొనవలదు!

II.సౌందర్యం

సృష్టి క్రమానుగతం హృదయానుభవ సారం
కనిపించును కనులకు వినిపించు వీనులకు!
అందమై చందమై ఆపాత మధురమై
ముదము గొల్పునట్టి సుధయేలే సౌందర్యం!

పసి వయసు తొలినాళ్ళ పసందు బోసి నగవు
వసి వాడిన వయసున పలుకునదే నగవు!
ఆ బోసి నగవులనె అందమెంతో దాగు

అంగన తనువైనను అంబరమున మెరుపైనను
కడలి కల్లోలమున కదిలే అలలైనను
సౌందర్య నర్తనమె సంబరమది ప్రకృతికి!

కొలనులో నిశ్చలత కోమలమగు ప్రశాంతి
సెలయేటి పరుగులో చెలగు చైతన్య గీతి!
హరిత పత్రములందు అరుణ కిరణములందు
వర్షపాతము వలని హర్షాతి రేకమందు -
ప్రకటితమగు సౌందర్యం
ప్రస్ఫుటమది ప్రసన్నం!
-----++-------



@ నేడు వినిపించని రాగం: (ఛం:అనియతం)

వింత శబ్దమొకటి వీధిలో వినిపించె
వీనులకది యెంతొ వేరుగా ధ్వనించె
గొంతెత్తి తానేడ్చె గువ్వ వంటి చిరు ప్రాణి
ఎంత సంబరమది ఎల్లలెరుగనిది
ప్రకటించె తనరాక ప్రపంచమంతటికి
పసిపాప ఏడుపే ప్రప్రథమ సంగీతం!
----++----++-----

@ఒక మినీ:
త్యాగం చేసిన ప్రతి ఒకడూ ఘనుడేనా?
రాగం తీసిన ప్రతి ఒకడూ గాయకుడా?

చే‌సిన త్యాగం పరులను బలిగొంటే
చెడిన రాగం కర్ణ కఠోరంగుంటే
ఉపయోగం కాదా ఉద్వేగం
ప్రయోజనం లేని పరాపకారం!
అరుదైన వీనాడు ఆరాగ మాధురులు.

-----++------+++--------++++
@Casual Banter:

@ అతీత వ్యక్తులు:

ఆలోచనా కుడ్య మధిగమించ రానిది
ఆవల యేమున్నదో అంతు పట్ట రానిది!

కాలమను చట్రమున కదలాడు యోచనలు
కలలుగా మారును కనులు మూసినప్పుడు!

కనులు తెరచినను కలలు గలుగుచుండు
చెదర గొట్టు మదిని చిలువలై పలువలై!
కనిపించకుండును కప్పుకుని వలువలు.

అతీతులగు వారు అడ్డుగోడలు దాటి
ఆనంద సీమలో అలరారుచుందురు!
వైరాగులై వారు వర్జింతు రాశలను
చావైన బ్రదుకైన సమముగా జూతురు!

అనుభవించిన వాడె అది చెప్పదగును,
పరుడి అనుభవము పరుడికే చెందు!

ఎరుగనట్టి వాడు ఊరకుండుట మేలు
ఒట్టికోతలేల ఉట్టికెక్క లేక!i

-----++-----++------+++--------+



Casual banter:

@ కవితా గానం:

కాకి నొక దానిని కవిత జెప్పమనిన
కావు, కావు కవితలు కల్లబొల్లి పలుకులు,
కాకి బలుకున దొకటె కవితయని పలికి
కావు కావు మనుచు ఘాటుగా పాడె!

పందినొక్కదాని పలుకు మనిన కవిత
పంకమే సుఖము పంకమే స్వర్గము
పంకమున కన్న పరము గలదె వేరని
పరవశించి పాడెను బురదలో నుండె!

చిలుక నొక్క దాని చిన్న పాట అడుగ
పలుకు ప్రతి పలుకు కలకండ పలుకు
చిలుకదా నాపలుకు చెలువమ్ములనుచు
సిగ్గు పడుచు చిలుక చిలిపిగా పాడె!

కోయిలమ్మను జీరి కోరగా పాట
గొంతెత్తి పాడెను కుహుకుహూ యనుచు:
'ఈ వసంత వేళలో ఈమావి గుబురులో
పాడమని నన్నడగ వలెనా
పరవశించి పాడనా 'యనుచు!



@రాను రానూ:

నడిచే ప్రతి మనిషీ ఒక యంత్రం
గడిచే ప్రతి క్షణమూ గతకాలం!

మనిషి లోపల మనిషి
కలడో లేడో సందేహం!

మస్తిష్కం నించి జనించిన
మస్తిష్కాన్నే జయించిన
సంకేతాల సమాహారం సాంకేతికం.
ఆ సంకేతాలకె బానిస మానవ మస్తిష్కం !

నీ పుట్టు పూర్వోత్తరాలు
నీ పుట్టింటి ఆనవాళ్ళు
కార్పొరేట్ నిఘానేత్రాలకు
కారు చవకగ చిక్కిన చిరుతిళ్ళు!

లోలోతుల నిదురించే
సృజనాత్మకతకు సంకెళ్ళు!

-------+++-----++++++----------+



Casual banter:

@ ఎంపిక: (అనియతము)

ఎవరి గొప్పలు వారివి
ఎవరి తప్పులు వారివి!

గొప్పకాదని అనను గులాబి పూవులను
గర్హించ వద్దందు గన్నేరు పూవులను!

జ్ఞానమెరిగిన కాకి జగమెల్ల దిరుగ
కోయిలమ్మ జూసి గూడు దొంగిలించు!

కోయిల పాట తెలుపు కొత్త ఋతువు రాక
కాకి మాటలాడు కాల నియమము లేక!

ఎవరి గొప్పలు వారివి
ఎవరి తిప్పలు వారివి!
ఎవరి తప్పులు వారివి!

పూవుతో భ్రమరము పూసుకొని తిరుగు
అవసరముతో ప్రేమ అంకురము జరుగు!

అందరాని పండు ఆధ్యాత్మికమ్ము
అందుకొనిన వారు ఆరాధ్యనీయులే,


-----------

గృహిణి స్వగతం:

ఇంటి లోపలి దొకటి ఇంటి బయటిది ఒకటి
ఇంతి జగములు రెండు వేరు వేరుగ నుండు;
ఇల్లు శుభ్రము జేసి పూజ భక్తిగ జేసి
వంట నేర్పుగ జేసి భోజనాదులు ముగిసి--
నడుము వాల్చు నప్పటికి
ఇంటికీ బయటికీ వారధి యగు కిటికీ;
కిటికీకి చేరువగ నేనపుడు శయనించి
లోకమును గాంతు నింటిలో నుంచి;
కనుగొందు బయటి లోకపుటందమును,
కనులారగందునా కమనీయ లోకమును;

అలికినటులుండునది ఆకాశపు నీలము,
నలుపు తెలుపుల మేలుకలయికై మేఘము;

అల్లంత ఎత్తులో అలరించు వృక్షములు
కళ్ళకింపుగ పచ్చగ పత్ర హరితములు;

కింద తోట లోన కిలకిలా రావములు
అందమెంతొ వొలుకు పంచ వన్నెల పూలు;

హర్షమెల్లరకు నే వండుచుండు విందులు,
వర్ష రుతువు నందు నాకగు కను విందులు!

------+------+
బేల: Not posted as on dated
ఎంత బేలగా చూసేవు ఎవరు నువ్వంటే
ఎంత భావం దాచుకుంది నీ మౌనం
ఎన్ని మాటలు చెప్పేయి నీ కళ్ళు
అన్నెమెరుగవు పున్నెమెరుగవు
అమ్మ ఎవరో చూసి ఎరుగవు
 కడుపునిండా అన్నమెరుగవు
ఈ జనారణ్యంలో భీత హరిణం లా
గాలికెగిరే జిల్లేడు పువ్వు లాగా
తడబడుతూ దారంట తచ్చాడుతూ
దిక్కు తెలియక సాగిపోయేవా
గమ్యమెరుగవు బతుకు
తెరువుకు మార్గమెరుగవు
తిట్టులేని పలకరింపే ఎన్నడెరుగవు
పదుగురెపుడూ తిట్టుటెందుకొ
పరికించి నీవెన్నడెరుగవు
యేమున్నదో నీమనసు లోతుల
చెప్పలేవే నీ నోటమాటల
నీ కళ్ళు పలికేను లోతైనభావాలు
హ్రృదయాలు కలచేటి రాగాలు
ఆ చూపులన్నీ ప్రశ్నలే
విప్పరానీ చిక్కులే
-----+-------+


FB posted
వచన కవిత: (తొలి ప్రయత్నం)

సృష్టిని గౌరవిద్దాం:

భగవద్దత్తమో, మరేదో కానీ
అపురూపమైన, అసంకల్పితమైన
అత్యంత సంక్లిష్టమైన ఈమానవ శరీరాన్నెందుకిలా తూలనాడుతావు?
వేదాంత దంతాలతో దాన్ని చీల్చి చెండాడి చులకన చేస్తావు?
నువ్వు సృష్టించగలది అత్యల్పం, నీకంది వచ్చినది అత్యంత అద్భుతం. అది గ్రహించ లేని నీ అహంకారం అందులో బందీవని భ్రమ పెడుతుంది.
నీవేర్పరచిన నీతికి సహకరించ లేదని చిన్నబుచ్చుతావు.
ఒకింత వినయం, ఒకింత శ్రద్ధ. నీలోని పరమాత్మకొకింత గౌరవం.
ఇది తోలు తిత్తి అనీ, పాపాలకు మూలమనీ పరిహసిస్తావు? నీ ప్రాణానికి ప్రశస్తమైన నివాసమని,అది లేనిదే నువు లేవనీ అర్థం చేసుకో. శుష్క వేదాంతంతో, పవిత్రాహంకారంతో, పొగ గొట్టాలతో, గ్యాలన్ల కొలదీ మత్తుతో కొంచెం, కొంచెం కాల్చకు. ఈ కాయానికి నువు చేసే గాయం పరమాత్మకు నువు చేసే అపచారం.
అరచేతిలోని పుష్పం నోచుకున్న శ్రద్ధ ఈమహోత్కృష్ట సృష్టి వైచిత్ర్యం నోచుకోరా
దా
+-----+-------+

FB posted
మంజుల గీతి:
(మేడమ్ సుప్రభ గారు సూచించినది)

నవయుగమున నారి:

నారి ఈనాడు మారి పోయినది
మారె దృక్పథము మారె ఆశయము
కోరె హక్కులను కోరె గౌరవము
కోరి పదవుల చేరె పైస్థాయి!

"నాదు జీవితము నాయిచ్ఛ లెమ్ము
ఏది మంచియని ఎరుకయే నాకు
చాదస్తమింక చాలించ వలెను
భూదేవి ఓర్పు లేదింక మాకు!

"భార్యనే నైన బానిస గాను
మర్యాద వలయు మనిషినే నేను!
భార్యగాకున్న, పడతినే నేను
మర్యాద వలయు మన్నన వలయు!

"మల్లియలవలె మాధురులిచ్చి
పిల్లలను గని పెంచుటే గాదు
ఎల్లలెరుగని వెన్ని కార్యములొ
చల్లగా జేయు చతురులే మేము!"

సకల జీవితము సంతాన లక్ష్మి
ఒకరి తదుపరి ఒకరుగా యింట
ఇక స్వంత ధ్యాస ఏరీతి గలుగు
చకచకా పనులు చక్క బెట్టుటయె!

కాలక్రమమున కరువైరి సంతు
చాలు ఒక్కరని సరిపెట్టుకొనిరి!
స్త్రీలు పొందిరిక తీరుబాటెంతొ
వీలుచిక్కినది వేరు పనులకు!

మేలు విద్యలిక మిన్నగా నేర్చి
ఏల సాగిరిక ఇంతులే జగముk
కొలువు చేపట్టి గొప్ప బాధ్యతలు
సులువుగా మోసి చూపెట్టినారు.

వెలుగు చాటుననె వెనువెంట నీడ
మలిన మానసులు మెలగు చున్నారు

కలుగ మోహమ్ము కలుగు కక్కుర్తి
బలిని కోరుటయు పరిపాటి నేడు!

Posted in FB :
నిద్రాభంగ జనిత ప్రేలాపనలు: dtd 7/9/2025

గ్రహణం:

అందాల చందురుని మింగ నేమి హేతువో
అసలు మింగువాడది రాహువో కేతువో
పొందలేడు వాడు మింగినా వదలు
బొందలేని వాడు మింగుటది ఏలా
చందమామ మనకు మరల దక్కుటే చాలు

లోకం తీరు:

మార్పు జరిగెను చూడు
తూర్పు మెరిసేను నేడు
*చతురస్ర మింకేది
చతికిల బడినదీ నాడు
ట్రంప్ చే సెను కంపు
తెంపు చేసెను పెంపు. *quad.
----------==--=-------

5/12/25
ఆశా స్వప్నం ( నిద్రాభంగ జనితం): సంతసమే సంతకమై వసంతమే సమంతమై హృదంతరాళము నందనమై కురియ వలె సుమ సమూహములు విరియ వలె సుమా జీవితములు మల్లెలు రాలి జల్లులై నేల పరిచిన నక్షత్రములై తరళములై మనసులు తారాపథ గామినులై సరళములై బ్రదుకులు ఆశావహ తమకములై జన జీవిత మానందముగా కొన సాగవలె ననంతముగా!
జన జీవిత మానందముగా
కొన సాగవలె ననంతముగా!
-------------
4/12/25
వృథా ప్రయాస:

రాయకున్న నేమి 
గుండె రాపిడి లేక
అటు జాణతనము గాదు
ఇటు జానపదము గాదు
పెచ్చు మాటల కొరకు
హెచ్చు యత్నము జేయ
జాలు వారదు కవిత
జొల్లు గారును కొంత

17/11/25
పాపులిజం లోని మాధుర్యం:

"కవిత వ్రాయుటెట్లు
పేరు పొందుటెట్లు
సూక్ష్మమెరిగించు గురువరా!"

మనసులో ఉన్నదొకటి
మాటలందున మరొకటి
ఏటికెదురీదబోకు
 గాలి వాటుకు తోడు
మేలు మాటలె వాడు
పుణ్యమూ పురుషార్థమూ
పుష్కలము పరమార్థమూ

 పేరుకై నువు బెండుగావలె కొంత
చేరు ప్రఖ్యాతి మెండుగా నీచెంత

నిజమేల నిష్ఠూరమేల
లేని పోనివి గొడవలేల
లేని ఎండకు గొడుగదేల

తన్ను మాలిన ధర్మమున్నదా
అన్నమైతే నేమిరా
సున్నమైతే నేమిరా!
అన్నమే తిందామురా!
ఏమింక వలయురా
ఏస్థటిక్సు లేలరా!

####₹₹
12/11/25
Just for fun:
Verbal cartoon:

మోడీని దొలగించ నలవి గాదని యెరిగి
మోడీని దొలగించ నేల వృథా యనియు
మోడీ వెనుక శక్తిని దొలగించ వలెనని
మో ఢీ చేతగాని ఘనుడొకడనియెన్.

ఆకలైన నక్క ఒకటి 
చెట్టు మీద ఉన్న ద్రాక్ష-
గుత్తులనూ చూసెనూ
తిన వలెనని కోరెనూ
అందకుండ పోయెనూ
మంచి పండ్లు కావనీ
 మౌనముతో పోయెనూ.....

Note: I don't know whether there is such a thing called a verbal cartoon, apart from jokes, satire etc.

27/10/25
నిద్రా భంగ జనిత ప్రేలాపనలు -2 :

క్షణం వెనుక క్షణం గడిచినట్టే 
దినం వెనుక దినం గడుస్తున్నది
 యుగం వెంట యుగం నడుస్తున్నది.
 ఆపుదామంటే కాలం
పిడికిట్లో నీరై జారిపోతున్నది.
అంతలోనే ఆవిరై పోతున్నది. 

కాలకూట గరళము వలె కాలుడి కంఠంలోనైనా
కాల మాగదు క్షణమైనా, నానో సెకనైనా.
దివా రాత్రముల మధ్య ఏమున్నా లేకున్నా
ఉదయం స్నానం మధ్యాహ్న భోజనం
రాత్రికి శయనం తప్పదు కద ప్రతి దినం.

@@@@@@@
13/9/25
కాల గణన (అనియతము):

క్షణము వెంట క్షణము
దినము వెంట దినము
 కాలమలా సతము గమన శీలమ్ము
కాలమెటులైన స్తంభించ నగునె!
నీరు మంచైనట్లు నిలచి పోనగునె!

పగలు రేయి గలసి పరగ నొక్క దినము
పగలె నక్తమై పోగ వెలుగు రిక్తమ్ము
అంతులేని రేయినపుడు గొల్చుట యెట్లు,
అంధకారము నందపుడు మొదలేది, తుదియేది!
కదలకున్న కాలమ్ము, గణన చేయనగునె?

గరళ కంఠము నందు కాలకూటము వోలె
కదలకుండ బోదు కాలమ్ము స్థాణువై!
జగమెపుడు జంగమమె చలన శీలమ్మె
పగలు రేయిల మధ్య కదలు కందుకపు క్రీడ!

నక్తము-రాత్రి, రిక్తము- లేనిది, కొల్చుట- గణించుట (ప్రార్థించుట కాదు).